కేంద్రమంత్రి రేసులో బీజేపీ ఎంపీలు?

కేంద్రమంత్రి రేసులో బీజేపీ ఎంపీలు?

కాషాయ పార్టీలో తీవ్ర పోటీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ 8 సీట్లు సాధించడంతో కేంద్రమంత్రులు ఎవరవుతారనే ప్రచారం సాగుతోంది. కేంద్ర కేబినెట్​బెర్త్​ దక్కించుకునేందుకు కాషాయ పార్టీలో తీవ్ర పోటీ నెలకొన్నది. 2019లో బీజేపీ నుంచి నలుగురు ఎంపీలుండగా.. బీజేపీ అధిష్టానం కిషన్​రెడ్డికి కేంద్రమంత్రిగా అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం ఆయనతోపాటు పలువురు ఎంపీలు మంత్రి పదవులకోసం పోటీపడుతున్నారు.

ఒకరిద్దరు మినహా ప్రస్తుతం గెలిచిన వారందరూ సీనియర్లే కావడంతో కేంద్ర మంత్రి పదవి ఎవరిని వరిస్తుందో అనే చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే రాజ్యసభ సభ్యులుగా లక్ష్మణ్ ఉండగా.. మహిళా కోటాలో బీజేపీ నేషనల్ వైస్  ప్రెసిడెంట్ డీకే అరుణ పోటీలో ఉన్నారు. వీరితోపాటు ఇప్పటికే వరుసగా రెండు సార్లు విజయం సాధించిన బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ కూడా కేంద్ర మంత్రి పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

మరోపక్క సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరిలో విజయం సాధించిన ఈటల రాజేందర్ కూడా కేంద్రమంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. జాతీయ నేతలతో మంచి సంబంధాలున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఈ సారి తెలంగాణకు రెండు మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉందని బీజేపీ నేతలు చెప్తున్నారు.